బైరాగుల బండి


బొగ్గింజన్ తో నడిచే రైలుబండి .

దాన్ని చూడడం , అందులో ప్రయాణం చేయడం
అప్పట్లో సరదాగా ఉండేది. అందులోని డ్రైవర్లు ఇనుప పారలతో వెనకవైపు ఉన్న బొగ్గును తెచ్చి ఇంజన్ లోకి పోస్తూఉండేవారు. ఆవిరితో కదిలేది. రైలింజనంతా పొగలు కక్కుతూ ఆవిర్లు వెదజల్లుతూ అదో పెద్ద డైనోసార్ లాగా కనిపించేది.

ఆ రైలు ఎక్కడమే గానీ ఎప్పుడు దిగుతామో తెలియదు . ఒక స్టేషన్లో ఆగింది అంటే ఎప్పుడు కదులుతుందో తెలియదు. నీలోని ఓపికంతా ఆవిరి అయితే తప్ప ఈ 'ఆవిరింజన్'గమ్యం చేరేది కాదు. అట్లా సాగేది ప్రయాణం. ప్రయాణికులు తిని పారేసిన చెనిక్కాయ పొట్టు ఎక్కడ చూసిన గాలికి ఎగురుతూ ఉండేది. దీని అసలు పేరు లోకల్. కానీ 'బైరాగుల బండి' అని అంటేనే ఎక్కువ మందికి అర్థమయ్యేది.

ప్రయాణికులంతా దర్జాగా కూర్చుని ఉండేవారు. ఎవరి దగ్గర టిక్కెట్లు ఉండేవి కాదు. టిక్కెట్ల తనిఖీ అధికారులు అని పిలువబడే 'టీసీలు' కూడా ఎవరూ వచ్చేవారు కాదు. సాధువులు, సన్యాసులు , బైరాగులు రైల్లో ఎక్కడ చూసినా కనిపించే వారు. తంబురా మీటుకుంటూ ఏవేవో జీవిత సత్యాలు తత్వాలు గా పాడుతుండేవారు. 'చిల్లర ఱాళ్లకు మొక్కుచునుంటే.. చిత్తము చెడునుర... ఒరే ఒరే... చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుచుండట సరే సరే...' అని బ్రహ్మం గారి జ్ఞాన తత్వాన్ని ఒకసారి పాడితే, మరోసారి' దేవ దారి పూల కై నేనొచ్చేదా ... దేవదేవుని పూజకై నేనొచ్చేదా ...' అని సిద్దయ్య పలుకు పాడేవారు. అట్లా వాళ్ల కీలు గొంతుల రాగాలతో, ఇంజన్ వేసే శబ్దాలతో కాలం ముందుకు సాగిపోతూ ఉండేది.

తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకుని గుండు కొట్టించుకుని వస్తున్న భక్తులు గోవింద నామాలు పలుకుతూ ఉండేవారు. భోగి ల నిండా గుండు కొట్టించుకున్న వాళ్లే ఎక్కువమంది. వెంట తీసుకెళ్తున్న తిరుమల లడ్డూ ప్రసాదం వాసన గుప్పుమనేది. అమ్ముకునే వాళ్ల కేకలతో , కొనమని మారాం చేసే పిల్లల ఏడుపుల తో రైలు రైలంతా అదో వింత లోకం లా ఉండేది. రైలు మామండూరు, బాలపల్లె శేషాచలం అటవీ ప్రాంతం మధ్యలో ఆగినప్పుడు గుండెలు అదిరిపోయేవి. ఒకరి ముఖాలు ఒకరు భయం భయంగా చూసుకునే వాళ్ళు.
చిన్న చిన్న స్టేషన్లలో కూడా గంటకు తక్కువ కాకుండా ఆపేవారు. తెచ్చుకున్న తిను బండారాలన్నీ అయిపోతే గాని రైలు కదిలేది కాదు. నీలోని ఓపిక, సహనం అన్నిటిని పరీక్షించడానికే దేవుడి దీన్ని పంపించాడు ఏమో అనిపించేది. ఏదైతే అదే అయ్యింది ఒక్కొక్కసారి ' దిగి నడుచుకుంటూ వెళ్ళిపోదాం' అని కూడా అనిపిస్తూ ఉండేది. ఆగిన స్టేషన్ లో నుంచి స్టేషన్ మాస్టర్ బయటికొచ్చి పచ్చజెండా ఊపితే ప్రాణం లేచి వచ్చేది. అప్పుడు 'ఇంజన్ వేసే విజిల్' మరి కాసేపు వినాలనిపించేది. కుదేలైన దేహానికి కుదుపు వచ్చేది. జీవితం మీద మళ్ళీ కొత్త ఆశ పుట్టేది. అట్లా ఆశనిరాశల మధ్య ఈ రైలు ప్రయాణం సాగేది.



రైల్లో పక్కనున్న వాళ్ల తోనే కాక
ఆ బోగీలో వాళ్లతో వీళ్ళకి, ఈ బోగీలో వాళ్లతో వాళ్లకి పరిచయాలు కూడా అయ్యేవి. బంధువులు కూడా అయిపోతారు ఏమోనని కూడా అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది. అటు వైపు కూర్చున్న వాళ్లది ఏ ఊరో, ఇటు వైపు కూర్చున్న వాళ్లది ఏ ఊరో , వాళ్లకి ఎంతమంది పిల్లలో , వాళ్ళు ఏమి చదువుకుంటున్నారో, వాళ్ళ బంధువులు ఎవరో... ఇట్లాంటి సమాచారమంతా క్షుణ్నంగా తెలుసుకునే మహద్భాగ్యం కలిగేది. అన్నయ్య, వదిన అనే వరసలు కూడా కలిసేవి.

ఆగిన ప్రతి స్టేషన్లో మర చెంబులు తీసుకెళ్లి ఓపిగ్గా, నిదానంగా, నిబ్బరంగా, తోసుకోకుండా, ఒకరు పైన ఒకరు పడకుండా , తాగి నన్ని తాగి, పిల్లలకి తాపించి ఒకటికి రెండు సార్లు తిరిగి నీళ్లు పట్టుకునేవారు. ఆ మరచెంబు ను పిల్లలు ఎంత ఇష్ట పడేవారో !
ఆ తండ్రి తన పిల్లాడిని ఎత్తుకొని పోయి ఇంజన్ డ్రైవర్ తో షేక్ హ్యాండ్ ఇప్పించి నప్పుడు ఆ పిల్లాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. రేపట్నుంచి వేసవి సెలవులు అని అన్నప్పుడు కూడా వాడింత ఆనందపడడు.
రైల్లో వెనకున్న గార్డ్ విజిల్ వేస్తూ పచ్చజెండా ఊపాడు.
ఎట్టకేలకు రైలు కదిలింది.

హఠాత్తుగా ఉన్నట్లుండి ఒక గంప నెత్తిన పెట్టుకొని, మరో చేత్తో రైలు పెట్టె కడ్డీ పట్టుకుని

ఒక అతను బోగి లోకి వచ్చి పడ్డాడు.

''రైలు కదిలిన తర్వాత ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? పడి సచ్చే దానికా?'' అని ఎవరో ఒకతను కేక వేశాడు.

గంప తో వచ్చిన అతను తలకు గంప కు మధ్యలో కుదురుగా పెట్టుకున్న టవల్ని విదిలించి దులుపుకొని కిందనే కూర్చుండిపోయాడు.

గంప తో పాటు కమ్మటి వాసన కూడా వస్తోంది.

ఏమున్నాయి అందులో? అటుగా వెళ్తున్న ఒకతను అడిగాడు కళ్ళు ఎగరేస్తూ.

' ఉడికేసిన శనక్కాయలున్నా ' జవాబిచ్చాడు గంపతను.

'బాగుండాయా'

'సూడున్నా...మెరిసిపోతాండాయి'

'సర్లే...' అంటూనే గంపలోని రెండు శనక్కాయలు చేతిలోకి తీసుకొని వలుచుకొని తిన్నాడు.

'అబ్బా... ఉప్పు కొంచెం ఎక్కువ పడింది. ఇంకొంచెం సేపు ఉడికించాల్సింది  ' అని చెప్పి అక్కడి నుంచి వేగంగా ముందుకు వెళ్లిపోయాడు.

వెళ్తున్న అతడిని చూస్తూ ముఖం చిట్లించుకున్నాడు గంపతను.

వస్తానే ఇట్లాంటి బేరం తగిలింది అని గొణుక్కుంటున్నాడు.

కాసేపట్లోనే బోగి అంతా ఉడికేసినా శనక్కాయల వాసన వ్యాపించింది.

ఎవరి అభిమానులు వారికి ఉంటారు.

ఉడికేసినా శనక్కాయల అభిమానులు కరుడుగట్టిన ఉన్మాదులు.

వాళ్లు తినడం మొదలుపెడితే చేతికి , నోటికి విరామం గానీ, విశ్రాంతి గానీ ఉండదు.

తీసేసిన పొట్టు వాళ్ల కాళ్ల కింద ఎవరెస్టు శిఖరం అంత కుప్ప పడితే గాని వాళ్ల తృప్తి తీరదు.

పక్కన కూర్చున్న వాళ్లకు కనీసం రెండు గింజలు పెట్టాలన్న చేతులు రానంతవీరాభిమన్యులు. కొనడానికి గంప దగ్గరికి వెళ్లిన వాళ్ళు అతను కాగితంలో పొట్లం కట్టే లోగా కనీసం రెండు గింజలైన తిని వాళ్ళ మోజు తీర్చుకుంటారు. నిద్రపోతున్న పిల్లవాడు ఎవడో లేచినట్టు ఉన్నాడు. వాడి ఏడుపు అప్పుడే నిద్ర లేచిన పిల్ల రాకాసి కూతలానే ఉంది.

రైలు బోగీలో నలుగురు ఆడుకునే పిల్లలు తగిలితే చాలు .

రైలు మొత్తం వాళ్ళ దెబ్బకు ఊగాల్సిందే.

పొరపాటున వాళ్ల చేతికి ఒక బాల్ దొరికితే హరోం హర.

ఎవరికి ఎప్పుడు వచ్చి తగులుతుందో తెలియదు. బిక్కు బిక్కు మంటూ ముడుక్కొని

బార్డర్లో సెంట్రీ డ్యూటీ చేసే సైనికుడిలా బాల్ ఎప్పుడు , ఎటువైపు నుంచి బుల్లెట్ లాగా దూసుకు వస్తుందోనని హై అలెర్ట్ తో ఉండడం మినహా ఇంకేమీ చేయలేం . 

 రైలు మరో రెండు స్టేషన్లు దాటిన తర్వాత మెల్లిగా శనక్కాయలు అమ్ముకుంటున్న అతని దగ్గరికి వెళ్లాను. గంప దాదాపుగా ఖాళీ అయిపోయింది. అడుగున కొన్ని కాయలు మాత్రం మిగిలి ఉన్నాయి.

అలా చివరన అడుగున మిగిలిపోయిన కాయలు కొనాలని నాకు అనిపించలేదు.

నేను కొనుక్కుంటే గంప ఖాళీ అయిపోయి మరి కాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపోవాలని అతని ఆలోచన లాగా అనిపిస్తుంది. ఇదొక మానసిక సంఘర్షణ ఇద్దరికీ.

అతను నన్ను పట్టించుకునే స్థితిలో లేడు.

అతను ఎడమ కాలి చిటికెన వేలు గోరు ను పదేపదే చూసుకుంటున్నాడు.

ఏమయింది? అడిగాను.

అతను తలపైకెత్తి నా వైపు చూసి చిన్నగా నవ్వాడు.

'గోరుకు దెబ్బ తగిలింది సారూ' జవాబిచ్చాడు.

గోరు దగ్గర రక్తం ఎర్రగా గడ్డకట్టి కనిపిస్తోంది.

'ఎలా? ' మళ్లీ ఇంకో ప్రశ్న.

ఇంతకుముందు గానే ...ఈ పెట్ట లోకి ఎక్కేటప్పుడు తగిలినట్లు ఉంది సారూ' చెబుతూనే మరోసారి దెబ్బ తగిలిన గోరు చూసుకుంటున్నాడు.

'అయ్యో! కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి కదయ్యా...' అని అన్నాను సానుభూతిగా.

'ఇలాంటివి మాకు రోజూ మామూలే సారు... ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది' చెప్పాడు అతను.

బయట నుంచి గాలి విసురుగా లోపలికి కొడుతోంది.

దూరంగా ఎక్కడో వర్షం పడుతున్నట్లు మట్టి వాసన వస్తోంది.

అతడి పేరు ఏమిటో, ఎక్కడుంటాడో, అతని జీవితం ఏమిటో తెలుసుకోవాలని ఉంది. కానీ అతను గోరుకు తగిలిన దెబ్బను చూసుకుంటున్న పరిస్థితుల్లో ఆ వివరాలు ఏవి తెలుసుకోవాలని నాకు అనిపించలేదు.

కాసేపట్లో ఏదో స్టేషన్ వస్తున్నట్లుంది.

అతను గంప సర్దుకుంటున్నాడు. గంపలోని వన్నీ నక్కాయలు ఒక కాగితంలో కి పోసి పొట్లం కట్టాడు. ఎంతోకొంత చిల్లర అతని చేతిలో పెట్టి దాన్ని కొనుక్కోవాలని నేను కూడా సిద్ధ పడ్డాను. ఇంతలో స్టేషన్ రానే వచ్చింది. రైలు ఆగింది. అతను కుంటుకుంటూ దిగుతున్నాడు.

నేను జేబులో నుంచి చిల్లర తీసేసరికి అతను పొట్లం నా చేతిలో పెట్టాడు.

ఇస్తున్న డబ్బు తీసుకోకుండా వద్దంటూ వారిస్తూ నవ్వుకుంటూ అట్లా ముందుకు ప్లాట్ ఫామ్ మీద వెళ్ళిపోతున్నాడు.

నేను అతడు వెళ్తున్న వైపే చూస్తుండిపోయాను.

ఆకాశం నుంచి చిన్న చినుకులు కురుస్తున్నాయి.


copyright © -డాక్టర్ వేంపల్లి గంగాధర్


Comments

  1. ఈ కాలానికి ఇలాటి రైలు కథ వింటుంటే భలేగా ఉంది. రైలు ఎప్పుడూ ఒక అద్భుతమే అనిపిస్తుంది.

    ReplyDelete
  2. 1970-80 దశకాల్లో ఇలాంటి రైలు అనుభవాలు మాకు ఉన్నాయ్. బాగా చెప్పారు gangadhargaru

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

The First writer 'in-residence' at Rashtrapati Bhavan-Dr Vempalli Gangadhar

హార్మోనియం గది

గజ్జెల పిల్లోడు