బడి ఇనుప గేటు
తెరుచుకుంది కిర్రు మంటూ శబ్దం చేసుకుంటూ!
మరో రెండు అడుగులు చిన్నగా ముందుకేశాడు నరసింహప్ప .
అటు వైపు దూరంగా చింత చెట్టు కింద నీడ పరచుకొని జోగుతోంది. దాని పక్కనే బోరింగు కొట్టుకొని నీళ్లు తాగుతున్నారు ఇద్దరు బడి పిల్లలు. ఆయాసపడుతూ ఆ పాత బోరింగు ఆగి ఆగి నీళ్లు కారుస్తోంది. కాసేపటి తర్వాత ఇక నావల్ల కాదన్నట్లు ఆగిపోయింది కూడా. ఉసూరుమంటూ పిల్లల అక్కడి నుంచి వెళ్లి పోతున్నారు.
ఎండ నిటారుగా తలపై పడుతోంది. భుజం పైని తుండుగుడ్డ విదిలించుకొని నెత్తికి కప్పుకున్నాడు. దూరంగా తరగతి గదుల్లో పిల్లలు ఎక్కాలు గట్టిగా పలుకుతున్నారు. ఆరవ తరగతి చదివే తన కొడుకు దాసప్ప ఉండే తరగతిగది ఏదో , ఎటు వైపు ఉందో వెతకాలి. బడి ఇప్పుడు మారిపోయింది. కొత్త గదులు వచ్చాయి. ప్రహరీ గోడ కట్టారు. చుట్టూ చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి.
'ఓబ్బీ...మా దాసప్ప యా దిక్కు ఉండేది!' అడిగినాడు ఎదురుగా వస్తున్న పిల్లాడిని.
ఉన్నట్లుండి అడిగేసరికి నరసింహప్ప కు కొడుకు చదువుతున్న తరగతి ఏదో వెంటనే గుర్తు కు రాలేదు.
'ఏం పేరున్నా' మళ్లీ అడిగాడు ఆ పిల్లవాడు .
'దాసప్ప... దాసప్ప' ఇది మాత్రం వెంటనే చెప్పాడు.
'దాసప్ప....ఆ పేరుతో మా మా బళ్లో ఎవరుండారుబ్బా ' అని దీర్ఘం తీశాడు పిల్లవాడు.
'బ్బీ.... ఆరో తరగతి' టక్కున ఏదో గుర్తొచ్చిన వాడిలా చెప్పాడు నరసింహప్ప.
చింత చెట్టు కు అవతల ఉన్న కొత్త గదుల వైపు దారి చూపించి వెళ్ళిపోయాడు పిల్లవాడు. అటువైపుకు కదిలాడు నరసింహప్ప.
తరగతి గది బయట నుంచి లోపలికి తొంగి చూశాడు.
ఉపాధ్యాయుడు బోర్డుపైన ఏదో రాస్తున్నాడు. పిల్లలు నిశ్శబ్దంగా రాసుకుంటున్నారు.
ఎవరో కొత్త వ్యక్తి బయట ఉన్నట్లు పిల్లలు అలికిడి చేస్తూ చూస్తున్నారు. రాస్తున్నది ఆపేసి బయటికి వచ్చాడు ఉపాధ్యాయుడు.
'ఎవరు కావాలి...?' అన్నట్లు చూశాడు.
'సారూ....'దాసప్ప... దాసప్ప' అని తడబడుతూ చెప్పాడు నరసింహప్ప.
'ఏ తరగతి ?' మళ్లీ ప్రశ్న.
తలపై వేసుకున్న తుండు గుడ్డను భుజం పైకి మార్చుకున్నాడు.
'ఆరో తరగతి సారూ...' అని జవాబిచ్చాడు.
'ఇంగ్లీష్ మీడియామా... తెలుగు మీడియామా' ఇంకో ప్రశ్న.
తల గోక్కున్నాడు నరసింహప్ప.
'సార్ ... దాసు వాళ్ల నాయన!' ఎవరో తరగతి గదిలో నుంచి గుర్తు పట్టిన పిల్లవాడు గట్టిగా చెప్పాడు.
'అవునా... నువ్వు దాసు వాళ్ళ నాయన వా! అయితే 'దాసప్ప' అని అంటున్నావ్!'
' ఔ...సారూ.. వాడికి ఇంటి కాడ పెట్టుండేది దాసప్ప అనే. వాళ్ళమ్మ బళ్లో జేర్పిచ్చేటప్పుడు దాసు అని రాపిచ్చింది.'
'దీని పైనున్న తరగతి గదిలో ఆరో తరగతి ఇంగ్లీష్ మీడియం ఉంది. మెట్లు ఎక్కి పైకి పోవాలి.
ఇక్కడే ఉండు, పిలిపిస్తాను' అని చెప్పాడు ఉపాధ్యాయుడు.
క్లాసులోని ఒక అబ్బాయిని పంపించి 'దాసు'ను కిందికి పిలిపించాడు.
తండ్రిని ఆశ్చర్యం గా చూస్తూ వచ్చాడు దాసు. ఉదయం ఇంటిదగ్గర బడికి బయలుదేరి వచ్చిన తరువాత సాయంత్రం వరకు తనకు ఇక్కడే సమయం. తండ్రి ఎప్పుడూ ఇలా మధ్యలో బడికి వచ్చిన సందర్భాలు లేవు.
' ఏం చేస్తుంటావు నువ్వు!' అడిగాడు ఉపాధ్యాయుడు.
' బ్యాండ్ వాయించడానికి పోతా ఉంటా ...డ్రమ్ము కొడతా సారూ...'
'దాసు బాగా చదువుతాడు. మంచి మార్కులు వస్తున్నాయి. బడి అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటి దగ్గర కూడా కూర్చోబెట్టి చదివించండి. తప్పకుండా ప్రయోజకుడు అవుతాడు.' అని స్కూల్ యూనిఫామ్ లో మెరిసిపోతున్న దాసు భుజం తట్టాడు ఉపాధ్యాయుడు.
అలాగే సార్ అన్నట్లు తలాడించాడు నరసింహప్ప.
'టౌన్ లో పని ఉండాది. పుస్తకాల సంచి తెచ్చుకో పో... పోవాలా...' అని కొడుక్కు చెప్పాడు.
దాసు ఉపాధ్యాయుడు వైపు అనుమతి కోసం చూశాడు.
' కాసేపు ఉంటే మధ్యాహ్న భోజనం పెడతారు. తిన్న తర్వాత పిలుచుకొని పో' అని చెప్పాడు ఉపాధ్యాయుడు చేతిలోని చాక్ పీస్ చెక్క బల్ల పైన పెడుతూ.
'టౌన్ లో పెళ్లి ఉండాది ... బిరిన పోవాలా....సారూ' తన కొడుకుని తన వెంట తీసుకెళ్లడానికి అనుమతి కోరుకున్నాడు నరసింహప్ప.
మాటల్లోనే మధ్యాహ్న విరామం 'బడి బువ్వ గంట' మోగింది.
పిల్లలు కేరింతలతో ప్లేట్లు పట్టుకొని పరుగులు పెడుతున్నారు.
చింత చెట్టు పైన ఉన్న పక్షులు పిల్లల అలికిడికి జడిసి శబ్దం చేస్తున్నాయి.
దాసు తన పుస్తకాల సంచి వీపుకు తగిలించుకున్నాడు.
తండ్రితో పాటూ వెళ్ళిపోయాడు.
* * * *
టౌన్ కి వెళ్లే బస్సు కదిలింది.
డ్రమ్, సైడ్ డ్రమ్, క్లారినెట్, డోలు, నాదస్వరం... వంటి సంగీత వాద్య పరికరాలు బస్సులో కనిపిస్తున్నాయి. ఒక చేతి సంచి కూడా ఉంది. వాటన్నిటి వైపు తదేకంగా చూస్తున్నాడు తన స్కూల్ బ్యాగ్ ఒళ్లో పెట్టుకొని దాసు.
బస్సు వేగంగా ముందుకు సాగిపోతోంది.
' అబ్బిగాన్ని బాగానే పట్టకచ్చి నావే...' నవ్వుకుంటూ అన్నాడు బ్యాండు బృందం మేస్త్రి జయరాములు.
డ్రమ్ తో పాటూ పక్కన కూర్చున్న నరసింహప్ప కూడా చిన్నగా నవ్వాడు. వెంట వస్తున్న అంజనప్ప, రామాంజి, దానప్ప, ఎల్లన్న కూడా ఎవరికి వారు ముసి ముసి గా నవ్వుకుంటున్నారు. తనను చూసి ఎందుకలా వాళ్లు నవ్వుతున్నారో దాసు కు అర్థం కావడం లేదు. అందరూ తాగి ఉన్నారు అని మాత్రం తెలుస్తోంది. నోర్లు తెరిస్తే వాసన గుప్పుమంటోంది.
కిటికీలోనుంచి బయట కి చూస్తున్నాడు దాసు.
కండక్టర్ టికెట్లు కొడుతూ వచ్చాడు.
'టౌన్ లో ఏదో మాంచి బేరం తగిలినట్లుందే' కళ్ళు ఎగరేశాడు కండక్టర్.
'ఔ... మార్కెట్ యార్డ్ రామిరెడ్డి అన్న చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉండాది.' జవాబిచ్చాడు మేస్త్రి జయరాములు.
' ఇంకేముండాది....నక్క తోక తొక్కి నారు... పండగ చేసుకోండి' కండక్టర్ గట్టిగా అనేశాడు.
అందరికీ కలిపి టిక్కెట్లు తీసుకున్నాడు మేస్త్రి జయరాములు.
టౌనుకు బయటే మార్కెట్ యార్డ్ వస్తుంది.
రెండు పెద్ద గోడౌన్లు దూరంగా కనిపిస్తున్నాయి. దిగవలసిన చోటు వస్తోంది సమాయత్తం కావలసిందిగా మేస్త్రి తన బృందానికి సైగ చేశాడు. ఎవరికి వారు తమ తమ వాద్య పరికరాలను జాగ్రత్తగా తీసుకొని దిగడానికి సిద్ధపడుతున్నారు. పైన పెట్టిన చేతిసంచిని రామాంజి తీసుకొని దాసు కి అందించాడు. బరువు ఏమీ లేవు. తెరచి చూశాడు.
స్టీల్ తో చేసిన జంజీల గజ్జలు. రెండు ఉన్నాయి. ఒక్కో చేతికి ఒక్కొక్కటి. వాటిని పట్టుకొని ఊపితే, అందులోని గులక రాళ్ళో, గింజలో లయబద్ధంగా శబ్దం చేస్తాయి. బ్యాండ్ మేళం లో అదికూడా ఒక వాద్యం.
కండక్టర్ నోటితో ఈల వేశాడు. బస్సు ఆగింది.
బ్యాండ్ మేళం బృందం కిందకి దిగింది.
ఎదురుగా అలంకరించబడిన మార్కెట్ యార్డ్. పెద్ద పెద్ద బ్యానర్లు. నిలువెత్తు స్వాగత ద్వారాలు. ఎటు చూసినా హడావిడి. ఖరీదైన కార్లు, ఖద్దరు చొక్కాలూ....!
నోట్లో గుట్కా వేసుకుని నములుతూ అక్కడ తగిలాడు ఎదురుగా బాలన్న.
బ్యాండ్ మేళం మేస్త్రి జయరాములు గట్టిగా కౌగిలించుకొని అతడిని పలకరించాడు.
టౌన్ లో వాళ్లు తన్నుకు పోకుండా ఈ బేరాన్ని తమ వరకూ తీసుకు వచ్చింది బాలన్న.
అందుకే ఇంత అభిమానం.
అయితే ఈ పని ఉచితం కాదు. కుదిర్చిన బేరంలో అతడి వాటా అతడికి ఇవ్వాలి . కమిషన్ అన్నమాట. అది పోగా మిగిలిం దే బృందం సభ్యులు పంచుకుంటారు. సింహభాగం మేస్త్రీని తీసుకుంటాడు.
' ఎమ్మెల్యే సార్ గూడా వస్తాడడు ... మీరింగ జల్ది గా పనికెక్కాల...' కేకేసినాడు బాలన్న.
'అట్నే సామీ ...నువ్వు జెప్పినట్లే' అనుకుంటా బృందాన్ని ముందుకు నడిపించాడు మేస్త్రి.
మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించిన గేటు ముందు వాద్యాలు జూలు విదిల్చుకున్నాయి.
ఒక్కొక్కరు ఒక్కో వాద్యపరికరం అందుకున్నారు.
దాసు చేతిలోకి గజ్జలు వచ్చాయి.
వాటిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడూ వాయించింది లేదు. ఇదే మొదటిసారి.
' అలవాటు ఐతాదిలే రా... ఇదేం బ్రహ్మవిద్యా...' అని భుజం తట్టి నాడు నరసింహప్ప.
పాటను బట్టి చేతులతో వాటిని ఊ0చుతూ ఉంటే సరిపోతుంది.
బ్యాండ్ మేళం శబ్దం వినపడగానే జనం గుమిగూడారు. సంతోష కేకలు, ఆనంద అరుపులు.
'సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ... ' పాట డోలు పైన వాయిస్తుంటే
ఉరిమే ఉత్సాహం... ఊపు... జనం ఎగబడి చూస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న బస్సుల్లోని వాళ్లు కూడా ఎగబడి చూస్తున్నారు.
అందరూ మైమరచి వాయిస్తుంటే, దాసు కూడా పరవశంతో తను చేస్తున్న పని లో లీనమై పోయాడు. అలుపు లేదు. ఆయాసం లేదు. గంట గడిచిన తరువాత
కాసేపు చేతులు నొప్పి తీశాయి. కానీ అంతమంది జనం చుట్టూ చేరి చప్పట్లు కొడుతుంటే సంబరంగా ఉంది.
లోపల ప్రమాణ స్వీకారం మొదలు కాగానే విరామం ఇచ్చారు.
ఈలోగా బాలన్న నాటు సారాయి తెచ్చాడు. అలాగే ప్లాస్టిక్ గ్లాసులు. దగ్గర్లో ఉన్న కంపచెట్ల పక్కన రాతి అరుగు పైన కూర్చున్నారు.
దాసు తన స్కూల్ బ్యాగ్ దగ్గరే కూర్చుండిపోయాడు.
అటుగా వెళ్తున్న ఎవరో రెండు అరటి పండ్లు ఇస్తే తీసుకున్నాడు. ఒకటి తిన్నాడు.
ఇంటిదగ్గర ఒంటరిగా ఉన్న అమ్మ గుర్తుకొచ్చింది. కళ్లల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. మిగిలిన అరటి పండు ను బ్యాగ్ లో పెట్టాడు.
కాసేపటి తర్వాత మళ్లీ పిలుపు వచ్చింది. ప్రమాణ స్వీకారం పూర్తయింది.
చైర్మన్ గారిని మెరవణి చేసుకుంటూ, ఊరేగింపుగా ఇంటి వద్ద దించి రావాలి.
బృందం తెచ్చుకున్న లగేజీ అంతా ర్యాలీలో వెనక వస్తున్న ట్రాక్టర్ లో వేయమన్నారు. దాంట్లోనే దాసు స్కూల్ బ్యాగ్ కూడా చేరింది.
కార్యకర్తల కోలాహలం మధ్య బ్యాండ్ మేళం పరవళ్ళు తొక్కింది.
రోడ్డు వెంట , దుమ్ము లేపు కుంటూ ముందుకు సాగారు.
మరో గంట గడిచిన తరువాత కార్యక్రమం ముగిసింది.
ముందస్తుగా మాట్లాడుకున్న పైకం ముట్టింది.
బాలన్న తన కమిషన్ జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు.
మేస్త్రి తన వాటా తీసుకొని, మిగిలిన డబ్బులు బృందంలోని సభ్యులందరికీ పంచాడు.
నరసింహప్ప కు రావలసిన నోట్లు అతడి జేబులో కి పెట్టాడు మేస్త్రి.
నరసింహప్ప బాగా తాగి వున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
' గజ్జలు వాయించిన నా కొడుక్కి కూలీ ఎగరగొడతావుండావా...' తాగిన మత్తులో గొణిగి నాడు.
మేస్త్రి నవ్వినాడు.
'నీకు తెలియనిది ఏముండాది మామ... ఇన్నేళ్లలో ఎప్పుడైనా, ఎవరికైనా గజ్జలు వాయించినందు లెక్క ఇచ్చింది సూసినావా ... ' అని అన్నాడు మేస్త్రి.
'ఏదో లేరాబ్బా ! పిల్లోనికి ఇంత చేతిలో పెడితే ఏమైతాది గానీ...' రామాంజి గదురుకున్నాడు.
మేస్త్రి తన నిక్కరు జేబులో నుంచి చేతికి వచ్చిన చిల్లరంతా తీసి దోసిలి పట్టమని దాసు చేతుల్లో పోశాడు.
దాసు రెండు చేతులు ఎర్రగా కందిపోయి ఉన్నాయి.
బృందమంతా అక్కడినుంచి బస్టాండ్ కి చేరుకొని , ఊరికి వెళ్లే చివరి బస్సు ఎక్కారు.
అందరూ నిద్రమత్తులోకి వెళ్లిపోయారు.
బస్సు గమ్యానికి చేర్చింది. భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, ఊగుతూ తూగుతూ ఉన్న తండ్రిని తన వెంట నిదానంగా, చీకట్లో మట్టి రోడ్డు వెంబడి నడిపించుకుంటూ ఇంటికి చేర్చాడు దాసు.
బడి పిల్లలు సాయంత్రమే దాసును తండ్రి నరసింహప్ప తన వెంట బ్యాండ్ మేళం తో పాటు పిలుచుకొని వెళ్లిన విషయం తులశమ్మ కు చేరవేశారు.
దాసు ను చూడగానే తల్లి తులశమ్మ మండిపడింది.
కోపంతో దబదబా నాలుగు దెబ్బలు వేసింది.
దాసు ఏడుస్తూ ఒక మూల కూర్చుండిపోయాడు.
నరసింహప్ప తప్పతాగిన కైపులో గుమ్మం బయటే పడుకుండి పోయాడు.
కాసేపటి తర్వాత కొడుకు దాసు కు అన్నం పెట్టింది.
కొద్దిగా తిని నిద్ర పోయాడు.
* * * * *
తెల్లారింది.
దాసుకు వళ్లంతా వేడిగా ఉంది. జ్వరం.
తులశమ్మ ' కొడుకు' చేతులు చూసింది. ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగు కుంది. భర్త నరసింహప్ప వైపు చూసింది. ఇంకా పడుకొనే పొర్లుతున్నాడు. చల్ల గా ఉండడానికి దాసు చేతులకు ఆముదం రాసింది. ఆరోజు దాసు స్కూల్ కి వెళ్ళలేదు. పడుకొనే ఉన్నాడు. కాసేపటి తర్వాత నరసింహప్ప లేచాడు.
'పిల్ల గాడ్ని ఎందుకు గజ్జల పనికి పిల్సకపోయినావని ' నిలదీసింది.తులశమ్మ మాటల్ని అతడు పట్టించుకోలేదు. పక్కనున్న వేప చెట్టు కొమ్మ విరిచి పళ్ళు తోముకుంటూన్న డు.
'పిల్లోడి చేతులు సూడుపో... ఎంత ఎర్రగా అయిపోయినాయో !' మరో సారి కన్నెర్ర చేసి చూసింది.
'సర్లే ...ఇన్ని కాఫీ నీళ్లు పొయ్యి' చిరాకు పడ్డాడు నరసింహప్ప.
' పొద్దున లేసినాముంచి పిల్లోడ్ని చూసుకునే దానికే సరి పోతాంది. వాడికి జ్వరం వస్తాంది.' అనింది.
'వానికి పని అలవాటు కావాలని పిల్సకపోయిన' చెప్పినాడు.
'వాణ్ని ఆ పనికి నా పేణం పోయినా అంపీను... బాగా సదివించు కోవాలా' బదులిచ్చింది.
బయట మూడు రాళ్ళ పొయ్యిమీద వేడి నీళ్లు మరుగు తున్నాయి .
స్నానం చేయడానికి వెళ్లిపోయాడు నరసింహప్ప.
తులశమ్మ ఆపకుండా ఏవేవో మాటలు చెప్తానే ఉంది. అవన్నీ అతడికి వినిపిస్తూనే ఉన్నాయి కానీ , ఎలాంటి స్పందనా లేదు . టవల్తో తల తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. లోగా ఇంట్లోకి పోయి నాటు సారా సీసా తెచ్చుకున్నాడు. నడి ఇంట్లో కూర్చొని తాగుతున్నాడు.
అది ఇంట్లో ఎప్పుడూ ఉండే దృశ్యమే. తులశమ్మ కు కొత్తగా ఏమీ లేదు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత- ఒక కొలిక్కి వచ్చిన దానిలా
' ఇంకెప్పుడూ పిల్లోడిని గజ్జల పనికి పిల్సక పోనని' మాటిమ్మని అడిగింది.
పిల్లోడి మీద ఒట్టేసి చెప్పమంది. బాగా తాగి వున్నాడు నరసింహప్ప.
'అట్టనే లెమ్మీ ..ఇంగెప్పుడు వాడ్ని నా వెనకాల పిల్సక పోను' అని ఒట్టు వేశాడు.
' సరే... ఆ కుండలో రాగి సంగటి, గోగాకు ఊరుబిండి వుండాది. నువ్వూ, పిల్లగాడు ఇద్దరూ తినండి' అని చెప్పింది.
బయట బేల్దారి పని కి త్వరగా పోదాం రమ్మని పిలుస్తున్న వాళ్లతో పాటూ దిగులుగా వెళ్ళిపోయింది తులశమ్మ.
----------------------------
వారం రోజులు గడిచిపోయాయి.
ఉదయం పూట ఇంటర్వెల్ కు ఇంటికి వచ్చిన బడి పిల్లలు సమాచారం మొకటి మోసుకొచ్చారు. బడి దగ్గరికి నరసింహప్ప వచ్చాడని... తనతో పాటూ దాసు ను వెంటబెట్టుకొని పోయినాడని ! తులశమ్మ కు నెత్తిన పిడుగు పడినట్లు అయింది. బండ దగ్గర ఉతుకుతున్న బట్టల్ని అలాగే వదిలేసింది . ఇంటి తలుపుకు గడియ కూడా వేయలేదు.
చీర కుచ్చిల్లు ఎగదోసి, పైట కొంగు బిగించి ఉరుకులు పరుగులు పెడుతూ పోతావుంది.. బడి దిక్కు! ఇండ్లలోని వాళ్ళందరూ ఏం జరుగుతుందో అని బయటకొచ్చి చూస్తున్నారు. ఎప్పుడూ ఆమెలో ఇంత ఆవేశాన్ని, కోపాన్ని చూసింది లేదు. సగం దూరం వెళ్లగానే ఇంకొందరు బడిపిల్లలు ఎదురైనా రు.
'క్కా... దాసును వాళ్ల నాయనొచ్చి పిల్సక పోయినాడని' చెప్తావుండారు.
'వాళ్లు యాడికి పోయినారు... బ్బీ' ఆవేశంతో అడిగింది తులశమ్మ.
' ఏమోక్కా... మాకేం తెల్దు' అని బయపడ్తా బదులిచ్చినారు బడి పిల్లలు.
అట్నే ముందుకు సరసరా పోతుంది. ఎక్కడికి పోయి ఉంటారో అంతుచిక్కడం లేదు. మనసు పరిపరివిధాలుగా ఆలోచనలు పోతోంది. మేస్త్రి జయ రాములన్న ఇంటి కాడికి పోతే విషయం తెలియవచ్చు. అడుగులు ఎగువ వీధిలో కి మారినాయి. వేగంగా పోతానే ఉండాది.
కళ్లల్లో కన్నీళ్లు ...కోపం.
ఇంకో వీధి దాటుకుంటే మేస్త్రి ఇల్లు వస్తాది. సందు చివరి కుక్కలు వేగంగా వస్తున్న తులశమ్మ ను చూసి ఆగి ఆగి మొరుగుతున్నాయి. బయట అరుగు మీద కూర్చొని చిక్కుడుకాయలు వలుచుకుంటోంది మేస్త్రి భార్య లలితమ్మ.
దూరం నుంచి తులశమ్మ ను చూసింది. ఎప్పుడు ఆ వీధిలోకి ఆమె రాలేదు.
చాలా కాలమైంది చూసి. వచ్చీరాగానే అరుగుపైన కూర్చోమని చెప్పింది లలితమ్మ. లోగా ఇంట్లోకి పోయి గ్లాస్ తో నీళ్ళు తెచ్చింది.
'నాకు నీళ్ళూ వద్దు. నిప్పులూ వద్దు గానీ వాళ్ళు యాడికి పోయినారో చెప్పక్క' గదమాయించి అడిగింది తులశమ్మ.
'అదో... మేదర వీధి లోని రామాలయం దగ్గర సర్పంచ్ మనవడి పుట్టెంటుకలు తీస్తావుండారని పోయినారు. మధ్యాహ్నం వరకే ఒప్పు కొనింది. వచ్చేస్తారు లే.. 'అని ఏదో చెప్పబోయింది లలితమ్మ.
'ఆయప్పను యాడన్న సావమను, నేనేమడగను.పిల్లోడిని బడికాడికి పోయి పిల్సక పోవాకని ఎన్నిసార్లు చెప్పి నా నా మాట వినిపించుకునింది ఏది ...'
'సరేలే.. ఎవరూ దొరకలేదని పిల్సక పోయి ఉంటాడు. గజ్జెలు వాయించేది ఏమంత పని? అంత దానికి ఇంత కోపం నీకు ఎందుకు వస్తాంది?
నా కొడుకును చదువుకోనీ కుండా గజ్జలు ఊ0చే పనికి పిల్సక పోతే కోపం నాకు రాకపోతే నీకు వస్తుందా? అని అక్కడినుంచి పైకి లేచింది తులశమ్మ. అడుగులు వేగంగా పడుతున్నాయి. దూరంగా రామాలయం వద్ద బ్యాండ్ మేళం శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం వినిపిస్తున్న కొద్దీ గుండె రగిలిపోతోంది. నోటికొచ్చిన పెద్ద మాటలన్నీ పైకి బిగ్గరగా తిడుతోంది. రామాలయం వద్ద సందడిగా ఉంది. జనమంతా గుమికూడి ఉన్నారు . బ్యాండ్ మేళం మధ్యలో ఇద్దరు నిలబడి డ్యాన్స్ చేస్తున్నారు.
నరసింహప్ప డ్రమ్ము వాయిస్తున్నాడు హుషారుగా. పక్కనే గజ్జలు ఊ0చుతూ దాసు.
చూడగానే గుండె మండిపోయింది. పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. కిందనున్న మట్టిని పిడికిట్లో కి తీసుకొని నరసింహప్ప పైకి విసిరేసింది. ఏవేవో శాపనార్థాలు పెడుతోంది. వెనకనే వచ్చిన లలితమ్మ వారించడానికి ప్రయత్నిస్తోంది. కానీ తులశమ్మ వినడం లేదు. కాసేపు ఏడుస్తోంది. కాసేపు తిడుతోంది.
కొడుకు దాసు చేతుల్లోని గజ్జలు లాక్కొని నేలకేసి బలంగా పుట్టింది.
అవి స్టీల్ వి కావడంతో పగల లేదు.
ఒకటేమో మురికి కాలువకు సమీపంలో, మరొకటి కంపచెట్ల వద్ద పడ్డాయి.
దాసు భుజాన్ని పట్టుకుని గుంజింది. నరసింహప్ప అడ్డుకోబోయాడు. చెంప చెళ్ళు మంది. అందరి ముందు మొగుడ్ని చంప మీద కొట్టడం అందరికీ ఆశ్చర్యం గా ఉంది. తిరిగి కొట్టబోయిన నరసింహప్ప ను మేస్త్రి పట్టుకున్నాడు. ఈసారి ఎగిరి తన్న బోయింది. మేస్త్రి నరసింహప్ప ను వేగంగా వెనక్కి లాగాడు. లలితమ్మ, అక్కడున్న ఇంకొంతమంది ఆడవాళ్ళు తులశమ్మ ను గట్టిగా పట్టుకుని అక్కడినుంచి పక్కకు లాక్కొచ్చారు. దాసు భయంతో ఏడుస్తున్నాడు. అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. సర్పంచయ్య వచ్చి తులశమ్మ కు ఏదో సర్ది చెప్పాడు. ఆమె ఏడుస్తూనే వేగంగా ముందుకు వచ్చి దాసును బలంగా లాగి తనతో పాటూ తీసుకెళ్తోంది. వాడు కింద పడి ఉన్న తన పుస్తకాల సంచిని భుజానికి తగిలించుకున్నాడు.
బడి వైపుకు పోతున్నారు ఇద్దరూ వేగంగా.నరసింహప్ప కన్నార్పకుండా నిర్ఘాంతపోయి వాళ్లనే చూస్తున్నాడు. కొడుకు పైన తులశమ్మ కు ఉన్న ప్రేమ, వాడిని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేసుకోవాలనే కల అందరికీ అర్థమవుతూనే ఉంది.
'గజ్జలు వాయించక పోయినా... పర్వాలేదు. బ్యాండ్ మేళం మళ్ళీ మొదలు పెట్టండి' కేకేశాడు సర్పంచయ్య.
'అట్టే లేన్న ..'.అని చేతిలోకి డోలు తీసుకున్నాడు మేస్త్రి.
నరసింహప్ప కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన వాడిలా కనిపిస్తున్నాడు. తన కొడుకును బాగా చదివించు కోవాలి. ఇంకెప్పుడూ వాడి చేతికి గజ్జలు ఇవ్వకూడదని గట్టిగా అనుకున్నాడు.
తల విదిలించుకుని, దుమ్ము దులుపుకుని డ్రమ్ము అందుకొని మెడలోకి వేసుకున్నాడు.
'అదీ దరువు... వెయ్... వెయ్'
మళ్లీ సంబరం మొదలైంది.
దాసును బడికి తీసుకొచ్చింది తులశమ్మ.
టీచర్ల తో మాట్లాడింది. సంతృప్తిగా ఊపిరిపీల్చుకుంది.
భారమేదో దిగిపోయినట్టు గా ఉంది.
బడి ఇనుప గేటు మూసి, కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటికొచ్చేసింది.
కాసేపు ఆలోచించింది.
రామాలయం వీధి వైపుకి అడుగులు పడుతున్నాయి.
మళ్లీ అక్కడికే వెళుతోంది.
దూరం నుంచి చూస్తున్నవాళ్లు మళ్లీ నరసింహప్ప కు సెకండ్ కోటా ఇవ్వడానికే వస్తోందని గుస గుస లాడు కుంటున్నారు. గుడికి అటువైపు కార్యక్రమం సంబరంగా జరుగుతోంది.
అక్కడికి చేరుకుంది తులశమ్మ.
గజ్జల కోసం కళ్ళు వెతుకుతున్నాయి.
మురికి కాలువ సమీపంలో పడిన ఒక దానిని, కంపచెట్ల వద్ద పడిన మరొక దానిని
చేతుల్లోకి తీసుకుంది.
Comments
Post a Comment