క్షురమర్ది


 ఆరు చింతమాన్ల గుట్ట పైన ఉన్న తెల్ల దొరల గుడారాల దగ్గరకు రమ్మని క్షురమర్దికి కబురు అందింది.

వాళ్లుండే డేరాల వైపుకు వెళ్లాలంటే ఒక గుండె ఉంటే సరిపోదు. ఆ విషయం క్షురమర్దికి కూడా తెలుసు.
అలాంటిది తనతో వాళ్లకు పని పడడం ఏమిటో. కొరివితో తల గోక్కుంటున్నట్లు ఉంది వ్యవహారం.

కబురు వచ్చిన తర్వాత వెళ్లకపోతే ఏమవుతుందో!
మంగలి కత్తులు పెట్టుకునే అడపం చేతిలోకి అందుకున్నాడు. తలకు బిగుతుగా కట్టిన తలపాగా ఒకసారి విప్పి గట్టిగా గాల్లోకి వదిలించి భుజాన వేసుకున్నాడు.
తెల్ల దొరల వ్యవహారం- గాడిదకి ముందున్న ముప్పే. వెనకున్న తప్పే.
తను పడుతున్న తిప్పలు చూసి గుడిసెల్లోని వాళ్ళు నవ్వుకుంటున్నారు.

పిలవడానికి వచ్చిన నల్లటి బంట్రోతు వ్యక్తి తో పాటూ ముందుకు కదిలాడు క్షురమర్ది.

గుట్టకు అవతల పారుతున్న నది ఒడ్డున ఉదయాన్నే
పడుతున్న ఎండకు చొక్కా విప్పుకొని దొరసానెమ్మెతో
కులాసాగా కబుర్లు చెబుతున్నాడు తెల్ల దొర.

ఆకాశం నుంచి దిగివచ్చిన దేవదూతల్లా తెల్లటి దేహాలతో మెరిసిపోతున్నారు.

వీళ్లను దూరం నుంచి చూసి ముఖం చిట్లించుకున్నారు వాళ్ళు. వస్తున్నది ఎవరు? అన్నట్లు పక్కన ఉన్న వాళ్ళని అడిగారు.
వాళ్ళు ఏదో జవాబు ఇచ్చారు.
తలాడించాడు ఇంగ్లీషు దొర.

క్షురమర్ది దూరంగా చేతులు కట్టుకొని సంకలో అడపం పెట్టుకొని బెరుకు బెరుకుగా నిల్చున్నాడు.
కొద్దిసేపు అక్కడే నిలబడిపోయాడు.
దూరంగా డేరాలు, అటువైపు ఇటువైపు రైఫిళ్లు చేత పట్టుకొని కాపలా కాస్తూ కొందరు మనుషులు.

నది కూడా నిశ్శబ్దంగా నోరు మూసుకొని ఉంది.
దరిదాపుల్లో పక్షులు కూడా ఏవి తిరుగుతున్నట్టు అలికిడి కూడా లేదు.

నది ఒడ్డున ఇసుకలో కూర్చొని నీళ్లలోకి రాళ్లు వేస్తూ పక్కనున్న పొడవాటి వ్యక్తికి తెల్ల దొర ఏదో చెబుతున్నాడు.ఆ చెప్పే విషయాలన్నీ పక్కనున్న పొడవాటి వ్యక్తి తలాడిస్తూ రాసుకుంటున్నాడు.

దూరంగా చెట్టు కింద కట్టేసిన గుర్రం గట్టిగా సకిలించింది. దాన్ని చూసుకునే వ్యక్తి అక్కడికి పరిగెత్తాడు.దానికి గడ్డి వేసి వచ్చాడు.

మళ్లీ నిశ్శబ్దం.
తెల్లదొర చెప్పింది అయిపోయింది అన్నట్లు తలాడించాడు. రాసుకునే వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
క్షురమర్ది ని పిలిపించమన్నట్లు తెల్ల దొర సైగ చేశాడు.
హుటాహుటిన పరిగెత్తుకుంటూ క్షురమర్ది దొర ఎదురుగా నిలబడ్డాడు. దొర చెక్క కుర్చీలో కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నాడు.

ఇంగ్లీషులో పక్కనున్న వ్యక్తితో దొర ఏదో అన్నాడు.

' దొరగారికి గడ్డం తీయాలి. జాగ్రత్త !జాగ్రత్త!' అని పక్కనున్న వ్యక్తి అదే విషయాన్ని తర్జుమా చేసి చెప్పాడు.
భుజాన వేసుకున్న తుండు గుడ్డ తో ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకున్నాడు క్షురమర్ది.
దొర పాలరాతి శిల్పంలా ఎండ పడి మెరిసిపోతున్నాడు.
దొర తాను వస్తున్నప్పుడు ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్న కొత్త అడపం పెట్టె ను గుడారంలో నుంచి తెప్పించాడు.
క్షురమర్ది కి ఎదురుగా పెట్టారు.
అలాంటి అడపం పెట్టె తాను ఎప్పుడూ
చూసింది లేదు. ఒంపులు తిరిగిన వెండి నగిషీలతో మెరిసే రంగురాళ్లతో చూడముచ్చటగా ఉంది
అడపం.
పెట్టె లోపల మెత్తటి పట్టు వస్త్రం లాంటి గుడ్డతో చేసిన నిర్మాణం. అందులో బంగారు రంగుల మెరిసిపోతున్న గడ్డం తీసే కత్తులు. జుట్టు కత్తిరించే కత్తెరలు. కొత్తగా తలుక్కున మెరిశాయి.

'జాగ్రత్త జాగ్రత్త...' అని పక్కనున్న వ్యక్తి పదే పదే చెబుతున్నాడు.
క్షురమర్దికి ఆ వాతావరణమే కొత్తగా ఉంది.
భయంతో కాళ్లు చేతులు ఆడడం లేదు.
గడ్డం తీయడానికి కొత్త మంగలి కత్తి చేతికి అందుకున్నాడు కానీ వణుకు వస్తోంది.
దేహమంతా చెమటలు పడుతున్నాయి.
ఆ విషయం తెల్లదొర పసిగట్టాడు.
బిగ్గరగా నవ్వుతున్నాడు.
'బయపడవద్దు...జాగ్రత్త గా చెయ్యి' అని గదమాయించాడు పక్కనున్న మనిషి.
అలాగేనన్నట్లు క్షురమర్ది తలాడించాడు.
కొంత ధైర్యం తెచ్చుకున్నాడు.

ఈ వృత్తి కొత్తగా చేస్తున్నది ఏమీ కాదు. తరతరాలుగా వంశపారంపర్యంగా ఇదే నేలపైన తన కుటుంబం చేస్తున్న పని. ఈ పనిలో తనంత మొనగాడు లేడని క్షురమర్ది తండ్రి కూడా చెబుతుండేవాడు.
జరిగిన గతమంతా క్షురమర్ది కి కళ్ళముందు కదులుతోంది.
తెల్ల దొరకు గడ్డం తీసే అవకాశం తనకు రావడం అదృష్టం అని గుడిసెల్లో వాళ్ళు అందరూ అనుకుంటూ ఉన్నారు.

చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనే భావన క్షురమర్ది
శరీరంలోకి ప్రవేశించింది.
వేగంగా చేతులు కదిలాయి.
కాసేపటికి దొరకు గడ్డం తీయడం పూర్తయింది.
ఎక్కడా ఒక గాటు కూడా పడనీయలేదు.
వచ్చిన పని ముగిసింది. హమ్మయ్య అని
ఊపిరిపించుకున్నాడు క్షురమర్ది.

దొరగారి పాదాలకు నమస్కారం చేసుకొని అక్కడి నుంచి సెలవు తీసుకొని బయలుదేరి వస్తున్నప్పుడు ఒక చిన్న సంచి నిండా ధాన్యపు గింజలు ఇప్పించాడు దొర. కళ్ళకు అద్దుకొని వాటిని స్వీకరించి వినమ్రంగ మరొక్కసారి నమస్కరించుకొని విజయ గర్వంతో
'దొరగారి మనిషిని నేను' అనే ముద్ర వేయించుకొని
అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు క్షురమర్ది.

Comments

Popular posts from this blog

The First writer 'in-residence' at Rashtrapati Bhavan-Dr Vempalli Gangadhar

హార్మోనియం గది

గజ్జెల పిల్లోడు